ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చేరొద్దు: ఎంఈవో నాగయ్య.
బోధన్ ప్రతినిధి రాహుల్ : బోధన్ మండలంలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించవద్దని మండల విద్యాధికారి (ఎంఈవో) నాగయ్య తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అనుమతి, గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే ప్రవేశాలు కల్పించాలని సూచించారు.
బోధన్ మండలం సరస్వతి నగర్‌లో ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్న “ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్”కు ఇప్పటివరకు ప్రభుత్వ అనుమతి లేదా గుర్తింపు లభించలేదని స్పష్టం చేశారు. అలాగే “ఆచార్య విద్యాలయ” పాఠశాలకు 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ అనుమతి లేదని తెలిపారు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితాను బోధన్ మండల విద్యా వనరుల కేంద్రం నోటీస్ బోర్డులో ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు సంబంధిత వివరాలు పరిశీలించిన తర్వాతే పిల్లలను చేర్పించాలని కోరారు.
అదేవిధంగా, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠశాల ప్రాంగణంలో నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి విక్రయాలు నిర్వహించరాదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థుల విద్యా హక్కులు, నాణ్యమైన విద్య మరియు భద్రమైన విద్యా వాతావరణం కోసం తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు సహకరించాలని ఎంఈవో నాగయ్య కోరారు.
