కరీంనగర్లో డంప్ యార్డ్ తొలగించాలి: రాజకీయ పక్షాల జేఏసీ డిమాండ్.
కరీంనగర్ ప్రతినిధి :- కరీంనగర్ నగరంలో డంప్ యార్డ్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే నగరం నుంచి డంప్ యార్డ్‌ను తొలగించాలని రాజకీయ పక్షాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జనసేన నాయకులు ప్రజావాణిలో ఎస్ఈ రాజ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం, సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జంగిలి ఐలందర్ యాదవ్, జిందం ప్రసాద్, కొక్కిరాల సత్యరావు మాట్లాడుతూ డంప్ యార్డ్ నుంచి వెలువడుతున్న పొగ కారణంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
ఎన్నికల సమయంలో డంప్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాయని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని, ప్రస్తుత ప్రభుత్వం కూడా పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి డంప్ యార్డ్ పరిస్థితిని చూపించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రభుత్వాలు మారుతున్నా సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందన్నారు. వెంటనే డంప్ యార్డ్‌ను తరలించకపోతే రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
వినతిపత్రానికి స్పందించిన అధికారులు ఆరు నెలల్లో కరీంనగర్ నగరం నుంచి డంప్ యార్డ్‌ను తరలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విలీన గ్రామాల నుంచి వచ్చే చెత్తను ఆయా గ్రామాల్లోనే డంప్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు పైడిపల్లి రాజు, పున్నం రవి, ఆసంపల్లి వినయ్, న్యాలపట్ల రాజు, రోహిత్, బీర్ల పద్మ, కొట్టే అంజలి, మామిడిపల్లి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
