ఖమ్మం సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక కార్యాచరణ.
రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్ ప్రతినిధి: ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమీక్ష అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన ప్రయోజనాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల విడుదల వంటి సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టుల పనులు ఎక్కడా నిలిచిపోకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.

సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా భవిష్యత్తును మార్చే కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. పాలేరు లింక్ కెనాల్ ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు పాత ఆయకట్టును స్థిరీకరించే అవకాశం కలుగుతుందని వివరించారు.
రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, సాగునీటి విస్తరణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రధాన లక్ష్యాలని పేర్కొన్న మంత్రి, రైతుల అభ్యున్నతి కోసం అవసరమైన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం అవసరమైన నిధుల కేటాయింపులో ఎలాంటి వెనుకంజ ఉండదని స్పష్టం చేశారు.
