ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి: విద్యార్థి సంఘాల జేఏసీ.
బోధన్ ప్రతినిధి రాహుల్ :- నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని బోధన్ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం స్థానిక పీఆర్టీయూ భవన్లో జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఎన్. బాల్రాజ్, ఎం.డి. మోషిన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల విద్యా హక్కులను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని వసతులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను సకాలంలో అందజేయడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం, తగిన మరుగుదొడ్లు మరియు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాలు కల్పించడం, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, విద్యాశాఖ అధికారులు క్రమం తప్పకుండా పాఠశాలలను పర్యవేక్షించడం వంటి డిమాండ్లను జేఏసీ ప్రతిపాదించింది.

అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలని, అర్హత కలిగిన ఉపాధ్యాయులతోనే బోధన నిర్వహించాలని, విద్యార్థులపై అధిక ఫీజుల భారం మోపకుండా నియంత్రిత ఫీజులు మాత్రమే వసూలు చేయాలని కోరింది. పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, బూట్లు తదితర వస్తువులను బలవంతంగా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని డిమాండ్ చేసింది.
విద్యార్థులకు ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలుగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు తల్లారి సంజయ్, డి. కిరణ్, రాజన్న, మోహన్, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.
