బాన్సువాడలో ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.

బాన్సువాడలో ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి – విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయానికి వినతిపత్రం.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్:-  ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం. 91 నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు బుధవారం ఎంఈఓ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.

 

 

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షుడు బైరాపూర్ రవీందర్ గౌడ్, తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాట్లం దత్తు, నిఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు.

 

 

పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలను నిర్దిష్ట దుకాణాల నుంచే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు.