ఎన్నారై దేవినేని శ్రీకాంత్ దాతృత్వం.. 10వ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారాలు.
ప్రథమ స్థానం సాధించిన అక్షయకు రూ.15 వేలు, ద్వితీయ స్థానం సాధించిన రిషబ్ కిరణ్‌కు రూ.10 వేలు అందజేత.
బోధన్ ప్రతినిధి రాహుల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంట కుర్ద్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు గురువారం నగదు పురస్కారాలు అందజేశారు.
సాలంపాడు గ్రామానికి చెందిన ఎన్నారై దేవినేని శ్రీకాంత్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నగదు పురస్కారాలను ఏర్పాటు చేశారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు దేవినేని సత్యనారాయణ, పార్వతి చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

పాఠశాలలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని అక్షయకు రూ.15 వేల నగదు పురస్కారం, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థి రిషబ్ కిరణ్‌కు రూ.10 వేల నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని సత్యనారాయణ, పార్వతి మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ప్రతిభ, పట్టుదలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ స్వగ్రామం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం సహకరిస్తూ ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న దేవినేని శ్రీకాంత్ సేవలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
