మాదకద్రవ్యాల నిర్మూలనకు యువత ముందుకు రావాలి: డీజీపీ సి.వి. ఆనంద్.
శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ తెలంగాణ వింగ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం.
హైదరాబాద్ ప్రతినిధి:- ఈగల్ ఫోర్స్ తెలంగాణ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మాదకద్రవ్యాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్ ఆధ్వర్యంలో, కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సి.వి. ఆనంద్, ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ పద్మజా, సినీ నటుడు రాము తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ బారిన పడితే జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వ్యసనం నేరాలకు, ఆత్మహత్యలకు, హింసాత్మక ప్రవర్తనకు దారితీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత సరైన మార్గంలో నడుస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని సూచించారు.

కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషారావు, ప్రభాకర్, సాయిలు పాటలు, సందేశాత్మక ప్రదర్శనల ద్వారా మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
