ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి: తెలంగాణ విద్యార్థి పరిషత్.
బోధన్ ప్రతినిధి రాహుల్:- బోధన్ పట్టణంలో ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేసి, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీవీపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బోధన్ ఆర్టీఓకు వినతిపత్రం సమర్పించింది.
ఈ సందర్భంగా టీవీపీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ, బోధన్ పట్టణంలోని యూనిక్ హైస్కూల్‌కు చెందిన AP20TB6907 నంబర్ స్కూల్ బస్సు బండారుపల్లి నుంచి శ్రీనివాస్ క్యాంప్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో స్టీరింగ్ హ్యాండిల్ రాడ్డు విరిగిపోవడంతో అదుపుతప్పిందని తెలిపారు. రోడ్డు పక్కన ఉన్న చెట్టు కారణంగా బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, లేకపోతే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని అన్నారు.

ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను వెంటనే సీజ్ చేయాలని, స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ప్రాణ భద్రత దృష్ట్యా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీవీపీ డివిజన్ కార్యదర్శి నిఖిల్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.
