జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రాణించిన విద్యార్థినులకు ఎమ్మెల్యే పోచారం అభినందనలు.

జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రాణించిన విద్యార్థినులకు ఎమ్మెల్యే పోచారం అభినందనలు.

వర్ని ప్రతినిధి చందర్: జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చిన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం గ్రామపంచాయతీ సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు బలుసు స్నేహ, ప్రహిషిత, లాస్యలను బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తన నివాసంలో ఘనంగా సన్మానించి అభినందించారు.

 

 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు క్రీడల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం ఎంతో గర్వకారణమని అన్నారు. క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. జాతీయ స్థాయితోనే ఆగిపోకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రతిభ చాటుతూ జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం క్రీడాకారుల ప్రోత్సాహం కోసం కల్పిస్తున్న సౌకర్యాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థినులకు సూచించారు.

జాతీయ స్థాయిలో విజయం సాధించిన బలుసు స్నేహ, ప్రహిషిత, లాస్యల కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం కూడా అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతిభకు కొదవ లేదని, సరైన అవకాశాలు లభిస్తే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని అన్నారు.

 

 

 

ఈ కార్యక్రమంలో విద్యార్థినుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు (డీసీసీ) వెలగపూడి గోపాల్, పీఏసీఎస్ చైర్మన్ నామాల సాయిబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కళలగిరి తదితరులు పాల్గొని విద్యార్థినులను ఘనంగా అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.