శుభ్రత నిబంధనలు ఉల్లంఘించిన 5 సంస్థలకు జరిమానా – బోధన్‌లో మున్సిపల్ ఆకస్మిక తనిఖీలు.
బోధన ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీల్లో పరిశుభ్రత ప్రమాణాల అమలుపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పట్టణంలోని పలు ప్రముఖ హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలను పరిశీలించిన అధికారులు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, వంటశాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం వంటి అంశాలను తనిఖీ చేశారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని 5 వ్యాపార సంస్థలపై జరిమానాలు విధించారు. బావర్చి హోటల్‌కు రూ.1,000 జరిమానా విధించగా, గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు ఒక్కొక్కదానికి రూ.500 చొప్పున జరిమానా విధించారు.

ఈ సందర్భంగా కమిషనర్ జాదవ్ కృష్ణ మాట్లాడుతూ ఆహార వ్యాపార సంస్థలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా శుభ్రత ప్రమాణాలు పాటించాలని, నాణ్యమైన ఆహారం మాత్రమే అందించాలని సూచించారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. భవిష్యత్తులో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు దుకాణాలను సీజ్ చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్లు గణేష్, దత్తారావు తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు ఈ తరహా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

