నంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తాం: బాన్సువాడ సీఐ తుల శ్రీధర్.

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తాం: బాన్సువాడ సీఐ తుల శ్రీధర్.

బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్: బాన్సువాడ పట్టణంలో నంబర్ ప్లేట్ లేకుండా, అలాగే నంబర్ ప్లేట్‌లపై స్టిక్కర్లు అతికించి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం పట్టణంలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు నంబర్ ప్లేట్ లేని వాహనాలు, నంబర్ ప్లేట్‌లను స్పష్టంగా కనిపించకుండా స్టిక్కర్లు అతికించిన వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

 

 

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి వాహనానికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చట్టబద్ధమైన నంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

 

 

నేరాల నియంత్రణ, వాహనాల గుర్తింపు, ప్రజల భద్రత దృష్ట్యా నంబర్ ప్లేట్‌లు స్పష్టంగా కనిపించడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ప్రజలందరూ చట్టాలను గౌరవించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.