విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.

విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.

ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభం

బాన్సువాడ ప్రతినిధి వడ్ల శ్రీనివాస్ చారీ : బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలంలోని కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, చించోలి, కిష్టాపూర్, బీర్కూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌పల్లి చౌరస్తా పరిసర గ్రామాల నుంచి SRNK డిగ్రీ కళాశాలకు వెళ్లే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేయించారు.

 

 

 

ఈ నెల 7న తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్న సమయంలో కిష్టాపూర్, బీర్కూర్ పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. సమయానికి కళాశాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెప్పడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ మేరకు శుక్రవారం బాన్సువాడ బస్టాండ్‌లో ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి స్వయంగా బస్సులో SRNK డిగ్రీ కళాశాల వరకు ప్రయాణించారు. విద్యార్థులకు మరింత సౌకర్యంగా ఉండేలా ఉదయం, సాయంత్రం రెండు వేళల్లో బస్సు నడిపించాలని డిపో మేనేజర్‌కు సూచించారు.

 

 

 

కార్యక్రమంలో బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్, SRNK డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్‌తో పాటు బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.