యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ 2026 ఘనంగా నిర్వహణ

 

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ 2026 ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మిట్‌లో జాతీయ క్రీడా విధానాలు, క్రీడా విద్య, పరిశోధన, సాంకేతికత, ఉపాధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

 

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ తెలంగాణలో క్రీడల అభివృద్ధికి విశేష అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో బలమైన క్రీడా వ్యవస్థ నిర్మాణానికి దోహదం చేస్తుందని అన్నారు.

 

 

రాష్ట్ర క్రీడా సలహాదారు ఏ.పీ. జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ సోని బాలాదేవి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ కిషోర్ గోపీనాథన్ తదితరులు పాల్గొని యూనివర్సిటీ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.

 

 

క్రీడా విధానం, ఒలింపిక్ దృష్టి, క్రీడా శాస్త్రం, ఈ-స్పోర్ట్స్, పారా స్పోర్ట్స్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. దేశవ్యాప్తంగా క్రీడా నిపుణులు, విద్యావేత్తలు, క్రీడాకారులు హాజరయ్యారు.

 

 

పుల్లెల గోపీచంద్, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఇస్మాయిల్ బైగ్, నాగపురి రమేష్, అర్జున అవార్డు గ్రహీత జె.జె. శోభా, ఒలింపియన్ నేహా అగర్వాల్ వంటి ప్రముఖులు పాల్గొనడం విశేషం.