కేంద్రీకృత కొనుగోలు విధానంతో పారదర్శకత పెరుగుతుంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
విద్యార్థులకు అవసరమైన అన్ని సామగ్రి సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాంలు, నోట్‌బుక్స్, ట్రంక్ బాక్సులు తదితర అవసరమైన వస్తువులు సమయానికి అందితే విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టగలరని ఆయన అన్నారు.
విద్యాశాఖతో పాటు బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ, ఎస్సీ అభివృద్ధి శాఖల పరిధిలోని విద్యాసంస్థలకు సరఫరా చేసే వస్తువుల కేంద్రీకృత కొనుగోలు విధానంపై గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఇంతకుముందు ప్రతి శాఖ విడివిడిగా కొనుగోళ్లు నిర్వహించడం వల్ల ఏకరీతి లేకపోవడం, అవకతవకలు చోటుచేసుకోవడం జరిగేదని పేర్కొన్నారు. ఈ సమస్యలను నివారించేందుకు ప్రభుత్వం కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
యూనిఫాంలు, నోట్‌బుక్స్, ట్రంక్ బాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్‌సూట్లు, బెడ్‌షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు వంటి వస్తువుల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
జూన్ 15 నాటికి అన్ని వస్తువులు విద్యార్థులకు అందేలా చూడాలని, సరఫరా అనంతరం వెంటనే చెల్లింపులు జరపాలని సూచించారు. పంపిణీ పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు.
ప్రతి విద్యార్థి నుంచి నోట్‌బుక్స్, యూనిఫాంలు తదితర వస్తువుల నాణ్యతపై అభిప్రాయం సేకరించాలని, శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
