అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.

అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రమజీవులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, తమ ప్రభుత్వంలో కార్మికులకు తగిన గౌరవం లభిస్తోందని పేర్కొన్నారు.

 

 

రాష్ట్ర అభివృద్ధిలో కార్మికులు నిజమైన భాగస్వాములని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం కార్మికుల అభ్యున్నతికి దోహదం చేస్తుందని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

 

 

అధికారంలోకి వచ్చిన వెంటనే అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. అలాగే తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లును తీసుకువచ్చినట్లు తెలిపారు.

 

 

ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేశామని, సింగరేణి కార్మికులకు దసరా, దీపావళికి ముందుగానే బోనస్ చెల్లించామని పేర్కొన్నారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,000 బోనస్ ఇచ్చినట్లు తెలిపారు.

 

 

అదనంగా, పలు బ్యాంకుల సహకారంతో కార్మికులకు రూ.1 కోటి వరకు బీమా సదుపాయం కల్పించామని, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. విదేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు.