“పిల్లల చిరునవ్వే నిజమైన అభివృద్ధి” – మంత్రి సీతక్క.

“పిల్లల చిరునవ్వే నిజమైన అభివృద్ధి” – మంత్రి సీతక్క.

రాష్ట్ర ప్రభుత్వం బాలల సంక్షేమం, తల్లుల గౌరవం, కుటుంబ భద్రత దిశగా మరో కీలక అడుగు వేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క కాచిగూడ రైల్వే స్టేషన్‌లో అడాప్షన్ హెల్పింగ్ డెస్క్, ఫోస్టర్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. అలాగే కాచిగూడ బస్ స్టేషన్‌లో బ్రెస్ట్‌ఫీడింగ్ కియోస్క్‌ను ప్రారంభించారు.

 

 

ఈ కార్యక్రమంలో అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా తదితరులు పాల్గొన్నారు.

 

 

 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పిల్లల చిరునవ్వే నిజమైన అభివృద్ధికి కొలమానమని అన్నారు. ప్రతి చిన్నారి జీవితంలో వెలుగు నింపడం, ప్రతి తల్లికి గౌరవం కల్పించడం, ప్రతి కుటుంబానికి భద్రత అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

 

 

అడాప్షన్ హెల్పింగ్ డెస్క్ ద్వారా కుటుంబ ప్రేమకు దూరమైన చిన్నారులకు కొత్త జీవితం అందించవచ్చని చెప్పారు. దత్తత అనేది దానం కాదని, అది ఒక చిన్నారి జీవితానికి కొత్త ఆరంభమని స్పష్టం చేశారు. ఈ కేంద్రం ద్వారా సరైన సమాచారం, చట్టపరమైన మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ సేవలు అందిస్తామని తెలిపారు.

 

 

ఫోస్టర్ కేర్ విధానం పిల్లలకు తాత్కాలికంగా ప్రేమతో కూడిన వాతావరణాన్ని కల్పిస్తుందని, అది వారి భవిష్యత్తుకు ఆశాకిరణంగా మారుతుందని పేర్కొన్నారు.

 

 

బ్రెస్ట్‌ఫీడింగ్ కియోస్క్ ప్రారంభంపై మాట్లాడుతూ, ప్రజా ప్రదేశాల్లో తల్లులకు గౌరవం, గోప్యత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం విశేషమని తెలిపారు.

 

 

పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని, రోష్ని సెంటర్ భాగస్వామ్యంతో కౌన్సెలింగ్, థెరపీ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

 

 

ఈ కార్యక్రమాలు ప్రభుత్వ “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక”లో భాగమని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.