బీడీ కార్మికులకు శుభవార్త – వేతనాల పెంపుపై ఒప్పందం.

బీడీ కార్మికులకు శుభవార్త – వేతనాల పెంపుపై ఒప్పందం.

బోధన్ ప్రతినిధి రాహుల్ :- బీడీ కార్మికుల వేతనాల పెంపుదలపై బీడీ యజమానుల ప్రతినిధులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ తెలిపారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

 

 

హైదరాబాద్‌లోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో జరిగిన సమావేశంలో ది తెలంగాణ బీడీ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హితేంద్రభాయ్ ఉపాధ్యాయ, రష్మీకాంత్ పటేల్, రమణ్ భాయ్ మరియు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం. నరేందర్‌తో పాటు ఇతర కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో వేతనాల పెంపుపై ఒప్పందం కుదిరిందన్నారు.

ఒప్పందం ప్రకారం బీడీ ప్యాకర్లకు నెలకు రూ.4,500, సాటర్స్, గంపవాలా, బట్టివాలా, క్లర్క్, మునీమ్‌లకు నెలకు రూ.2,200 వేతన పెంపు కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే బీడీలు చుట్టే కార్మికులకు వెయ్యి బీడీలకు రూ.6 చొప్పున అదనంగా పెంపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

 

 

 

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షలకు పైగా బీడీ కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని మల్లేష్ అన్నారు. అయితే 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జారీ చేసిన 41వ నంబర్ జీవోను అమలు చేయకుండా, యజమానుల ఒత్తిడితో 81వ జీవో తీసుకువచ్చారని ఆరోపించారు. దీంతో గత 10 ఏళ్లుగా బీడీ కార్మికులు తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

కనీస వేతనాల జీవోను వెంటనే అమలు చేయాలని, లేకపోతే బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

 

 

ఈ సమావేశంలో టీయూసీఐ నాయకులు టీ. లాలయ్య, బీడీ వర్కర్స్ యూనియన్ బోధన్ పట్టణ నాయకులు ఇందిర, మంజుల, గంగామణి, రమా, అరుణ, లత, లలిత తదితరులు పాల్గొన్నారు.