బోధన్ ప్రతినిధి రాహుల్ :- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి మాట్లాడుతూ, “ఉన్నత వర్గాలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా?” అంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే బండి సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కేసులో జాప్యం చేయడం ద్వారా బెయిల్‌కు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు సెక్షన్లలో మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన న్యాయం జరగాలని, కానీ ఈ కేసులో ఆ సూత్రాలు అమలు కావడం లేదని ఆమె విమర్శించారు. బాధిత 17 ఏళ్ల మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం జరగేలా తక్షణమే బండి సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే, ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు బీపాషా బేగం, కళావతి, లక్ష్మి, సాయవ్వ, రెహానా బేగం, శోభ, సుగుణ, రాణి, గంగామణి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
