ఎల్లయ్య చెరువు మట్టి రవాణాతో బాన్సువాడలో ప్రజల ఇబ్బందులు.. దుమ్ము, శబ్ద కాలుష్యంపై ఆందోళన.
బాన్సువాడ ప్రతినిధి : బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు నుంచి భారీ టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున మట్టి తరలింపు జరుగుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు. కాలనీల గుండా ప్రతిరోజూ టిప్పర్లు రాకపోకలు సాగించడంతో దుమ్ము, ధూళి విపరీతంగా వ్యాపించి చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
అదేవిధంగా రాత్రి వేళల్లో కూడా టిప్పర్ల రాకపోకలు కొనసాగడంతో భారీ శబ్దాల కారణంగా నిద్రలేమి సమస్య ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యంతో పాటు కాలనీల ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.
మట్టి తరలింపుపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి, దుమ్ము నియంత్రణ చర్యలు తీసుకోవడంతో పాటు రాత్రి వేళల్లో టిప్పర్ల రాకపోకలను నియంత్రించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు.
