ఆదిలాబాద్‌లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా కార్యవర్గ సమావేశం.
ఆదిలాబాద్ ప్రతినిధి :- ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆదిలాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని విద్యుత్ తరంగిణి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ టి.సి. రాథోడ్, జాతీయ గౌరవాధ్యక్షుడు అమర్ సింగ్ తిలావత్, రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో బంజారా జాతి అభ్యున్నతి, కుల ధ్రువీకరణ పత్రాల సమస్యలు, విద్యా-ఉద్యోగ అవకాశాలు, గిరిజన హక్కుల పరిరక్షణ, సంఘ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ సమాజ సమస్యల పరిష్కారానికి సంఘాలు బలంగా ఉండాలని, ఐక్యంగా పోరాడితేనే శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు.
మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ దేశవ్యాప్తంగా బంజారా సమాజ హక్కుల సాధన కోసం ఉద్యమం కొనసాగుతోందని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ టి.సి. రాథోడ్ జాతి ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్ సంఘాన్ని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, కార్యకర్తలు మరియు బంజారా సమాజ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశం ముగింపులో బంజారా జాతి హక్కుల సాధన, సంఘ బలోపేతానికి సంబంధించి పలు కీలక తీర్మానాలను ఆమోదించారు.
