జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీపై మంత్రి పొంగులేటి హామీ.
ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్-హెచ్-2843) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో మంత్రికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో), జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు తగిన సూచనలు చేస్తానని తెలిపారు. వినతిపత్రాన్ని వెంటనే కలెక్టర్కు పంపించాలని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ, జర్నలిస్టుల్లో అధిక శాతం మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారేనని, తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో జర్నలిస్టులు తమ పిల్లల విద్యాభారాన్ని భరించడం కష్టసాధ్యమవుతోందన్నారు.
ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలో పేద విద్యార్థులకు ఉచిత విద్య కల్పించాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ, అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. కనీసం పేద, మధ్యతరగతి జర్నలిస్టుల పిల్లల విషయంలో అయినా ప్రత్యేక రాయితీలు అమలు చేయాలని మంత్రిని కోరారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, టీజేఏ జిల్లా అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, నాయకులు మారెడ్డి నాగేందర్ రెడ్డి, మధుశ్రీ, జానీపాషా, యాకేష్, గణేష్, పెండ్ర అంజయ్య, కొమిరె నాగేశ్వరరావు, అర్షద్, ఫయాజ్, యాకూబ్ పాషా, శరత్, యూసుఫ్, యాస లక్ష్మారెడ్డి, డి. రవికుమార్, కొరకొప్పుల రాంబాబు, కరణ్బాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
