విద్యను వ్యాపారంగా మార్చొద్దు: సంజయ్ తలారే.

 

బోధన్ ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతుండటంపై బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (బీడీఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు సంజయ్ తలారే ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చుతూ తల్లిదండ్రులపై, విద్యార్థులపై అధిక భారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.

 

 

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఐఐటీ, జేఈఈ, నీట్ ఫౌండేషన్, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ స్కూల్ వంటి ఆకర్షణీయ పేర్లతో విద్యార్థులను ఆకర్షిస్తూ భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని అనేక ప్రైవేట్ పాఠశాలలు ప్రత్యేక కోచింగ్, ర్యాంకుల హామీలు, అంతర్జాతీయ స్థాయి విద్య పేరుతో అడ్మిషన్లు చేపడుతున్నప్పటికీ, వాటికి అవసరమైన అనుమతులు, ప్రమాణాలు ఉన్నాయా అనే అంశంపై స్పష్టత లేదని అన్నారు.

 

 

 

చిన్నారులపై అధిక చదువు భారం, తరచూ పరీక్షలు, ప్రత్యేక కోచింగ్‌ల కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతోందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మరోవైపు అడ్మిషన్, ట్యూషన్, రవాణా, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేయడం వల్ల మధ్యతరగతి, బహుజన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలపై సమగ్ర విచారణ చేపట్టాలని సంజయ్ తలారే డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, మౌలిక సదుపాయాలు, ఫీజుల నిర్మాణం, ప్రచార ప్రకటనలపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా పరిశీలించాలని కోరారు. అనుమతులు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

 

 

 

విద్య ప్రతి చిన్నారి హక్కు అని, దానిని వ్యాపారంగా మార్చి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు దూరం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పారదర్శక విచారణ చేపట్టాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.