రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై పట్టణ స్థాయిలో అవగాహన.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై పట్టణ స్థాయిలో అవగాహన.

బాన్సువాడలో నాలుగు వార్డుల్లో విజయవంతంగా వార్డు సభలు.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు పట్టణాభివృద్ధి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బాన్సువాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక వార్డు సభలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 1, 10, 11, 12 వార్డుల్లో ఈ సభలు జరిగాయి.

 

 

 

పురపాలక సంఘం చైర్‌పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు-2026, “జల్ సంచయ్ – జల్ భాగీదారి” పథకం కింద వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, మురుగు కాలువల పూడికతీత, వర్షాకాల సంసిద్ధత కార్యాచరణ ప్రణాళిక, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, నీటి నిల్వ నివారణ, రోడ్లు మరియు వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజలకు వివరించారు.

 

 

 

అలాగే మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల బలోపేతం, యువజన ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత, గ్రామీణ-పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ శాఖల సేవలు మరియు పథకాల పురోగతిపై కూడా అధికార యంత్రాంగం ప్రజలకు వివరించింది.

ఇంకుడు గుంతల నిర్మాణం, తడి-పొడి చెత్త వేరు చేసి నిర్వహించడం, పచ్చదనం పెంపొందించడం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించి ప్రజలను చైతన్యపరిచారు.

 

 

 

ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ గడుమల లింగమేశ్వర్, 10వ వార్డు కౌన్సిలర్ జగన్నాథం నగేష్, 12వ వార్డు కౌన్సిలర్ గడ్డమీది అంజాగౌడ్, 1వ వార్డు కౌన్సిలర్ నస్రీన్ బేగం, కో-ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్, మహ్మద్ ఎజాజ్, పురపాలక సంఘ కమిషనర్ గోపు గంగాధర్‌తో పాటు పోలీసు, రెవెన్యూ, విద్యుత్, విద్య, నీటిపారుదల శాఖల అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

 

వార్డు సభల ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఈ సభలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.