పీటీసీ మామునూరులో ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగింపు.

పీటీసీ మామునూరులో ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం ఉత్సాహంగా కొనసాగింపు.

వరంగల్ ప్రతినిధి: పీటీసీ మామునూరులో 8(T) గర్ల్స్ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ (CATC) రెండో రోజు కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ శిబిరంలో 8(T) గర్ల్స్ బెటాలియన్ మరియు 11(T) బెటాలియన్‌లకు చెందిన మొత్తం 600 మంది క్యాడెట్లు పాల్గొంటున్నారు.

 

 

 

శిబిరం రెండో రోజు నిర్వహించిన ప్రారంభ సమావేశంలో కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ డి.వి. సంతోష్ మెహర్ క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్సీసీ శిబిరాలు కేవలం శిక్షణా కార్యక్రమాలు మాత్రమే కాకుండా, జీవితంలో విజయానికి అవసరమైన క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, జట్టు స్ఫూర్తిని పెంపొందించే వేదికలని ఆయన పేర్కొన్నారు.

 

 

 

శిబిరంలో లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, శిక్షణా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని క్యాడెట్లకు సూచించారు. దేశసేవకు అవసరమైన విలువలు, బాధ్యతాయుత పౌరసత్వం, వ్యక్తిత్వ వికాసానికి ఎన్సీసీ విశేషంగా దోహదపడుతుందని తెలిపారు.

 

 

శిబిర కాలంలో నిర్వహించే డ్రిల్, మ్యాప్ రీడింగ్, వ్యక్తిత్వ వికాసం, విపత్తు నిర్వహణ, సామాజిక సేవా కార్యక్రమాలు తదితర అంశాలను పూర్తిగా నేర్చుకుని తమ భవిష్యత్ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని క్యాడెట్లను ప్రోత్సహించారు.

 

 

ఈ సందర్భంగా విద్యా మరియు ఎన్సీసీ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు క్యాడెట్లకు మెరిటోరియస్ స్కాలర్‌షిప్ చెక్కులను లెఫ్టినెంట్ కల్నల్ డి.వి. సంతోష్ మెహర్ పంపిణీ చేశారు. స్కాలర్‌షిప్ పొందిన క్యాడెట్లను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఇతర క్యాడెట్లకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కార్యక్రమంలో 1 జీసీఐ, 2 ఏఎన్ఓలు, 8 సీటీఓలు, పీఐ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.