ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తుల పరిశీలన.
బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ :- బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన గురువారం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి నరేష్, పశువైద్యాధికారి మహేష్, ఆయా బ్యాంకుల మేనేజర్లు, పురపాలక సంఘ కమిషనర్ గోపు గంగాధర్ పాల్గొని లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించారు.
ప్రభుత్వం నుంచి బాన్సువాడ పట్టణానికి ఈ-స్కూటీలు 3, త్రీవీలర్ ఆటో 1, పశువుల యూనిట్ 1, సోలార్ పంపుసెట్ 1 చొప్పున మొత్తం ఆరు యూనిట్ల లక్ష్యాన్ని కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మొత్తం 24 దరఖాస్తులను స్వీకరించి, వాటి వివరాలను తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు పంపినట్లు వెల్లడించారు.
అధికారుల ఆమోదం అనంతరం అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారి నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, బ్యాంకు మేనేజర్లు, పశువైద్యాధికారి, పురపాలక సంఘ కమిషనర్, దరఖాస్తుదారులు తదితరులు పాల్గొన్నారు.
