కోటయ్య క్యాంప్‌లో అధ్వాన్న పారిశుద్ధ్యం.. డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయిన పరిస్థితి.

కోటయ్య క్యాంప్‌లో అధ్వాన్న పారిశుద్ధ్యం.. డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయిన పరిస్థితి.

వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులు దయనీయంగా మారాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని డ్రైనేజీలు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో మురుగునీరు సక్రమంగా ప్రవహించక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

 

 

గ్రామపంచాయతీ అధికారులు ఇంటి పన్నులు క్రమం తప్పకుండా వసూలు చేస్తున్నప్పటికీ, గ్రామ పరిశుభ్రత నిర్వహణపై తగిన శ్రద్ధ చూపడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డ్రైనేజీల్లో నిల్వ ఉన్న మురుగునీటి కారణంగా ఈగలు, దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్థానిక స్థాయిలో వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్థులు విమర్శించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రపరచడం, చెత్తను తొలగించడం, పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేయాలని కోరారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.