మహిమ కదుచా న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు – కోటయ్య క్యాంపులో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు.
వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కోటయ్య క్యాంపులో నెలకొన్న అధ్వాన పారిశుద్ధ్య పరిస్థితులపై మహిమ కదుచా న్యూస్ ప్రచురించిన ప్రత్యేక కథనానికి అధికారులు స్పందించారు. కాలనీలో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వ్యాపిస్తోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కథనంలో ప్రస్తావించారు.
దీనిపై స్పందించిన సంబంధిత అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.
అధికారుల తక్షణ స్పందనపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
