తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలి: మంత్రి కొండా సురేఖ.
హైదరాబాద్ :- తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మంత్రి సురేఖ బుధవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCRHRD)లో నిర్వహించిన బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో జూమ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, డీజీపీ సీవీ ఆనంద్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ, పోలీసు, విద్యుత్, ఆర్ అండ్ బీ, వాటర్‌వర్క్స్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, ఆర్టీసీ, మెట్రో, పర్యాటక, సమాచార పౌరసంబంధాల శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, మహిళల భక్తి, ప్రజల సామూహిక విశ్వాసాలకు ప్రతీక అని పేర్కొన్నారు. గతంలో ఒకే కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన బోనాలను ప్రస్తుతం మూడు కార్పొరేషన్ల పరిధిలోని ఏడు ప్రధాన బోనాల ఉత్సవాలుగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ఆలయాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ వెలుగులు, సీసీ కెమెరాలు, క్యూ లైన్లు వంటి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులతో వచ్చే తల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.20 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నాయకత్వంలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా బోనాల ప్రాంతాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
బోనాలు సమర్పణ, సాకా సమర్పణ, ఊయల ఊరేగింపులు, పోతురాజుల వీరంగాలు, రంగం కార్యక్రమాలు, ఘటాల ఊరేగింపులు వంటి సంప్రదాయ కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.

