పోచారంలో ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న పోచారం శ్రీనివాసరెడ్డి.
పోచారం ప్రతినిధి చందర్ :- ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా పోచారం గ్రామంలో నిర్వహించిన ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే Pocharam Srinivas Reddy పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను బూత్ లెవల్ అధికారి (బీఎల్‌వో)కు అందజేసి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. మాజీ డీసీసీబీ చైర్మన్ Pocharam Bhaskar Reddy కూడా కార్యక్రమంలో పాల్గొని ఓటు నమోదు చేసుకున్నారు.
అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ఇప్పటికే నమోదైన వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సవరణ చేసుకోవాలని సూచించారు.
ఓటరు జాబితా సక్రమంగా ఉండటం ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ రాజా నరేందర్ గౌడ్, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
