జూలై 10 విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు.
బోధన్ ప్రతినిధి రాహుల్:-
నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని పీఆర్‌టీయూ భవనంలో శనివారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 10న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఏఐపీఎస్‌యూ జిల్లా కార్యదర్శి బోడ అనిల్, పిడిఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత ఆరు సంవత్సరాలుగా స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సుమారు రూ.10,500 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉండటంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. నిధులు విడుదల కాకపోవడంతో విద్యాసంస్థలు సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం జీఓ నెం.7, 8, 9లను తీసుకువచ్చి ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తోందని విమర్శించారు.

విద్యారంగ సమస్యలపై డిమాండ్లుగా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, మెస్ మరియు కాస్మెటిక్ చార్జీల పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ, మధ్యాహ్న భోజన నాణ్యత మెరుగుదల, హాస్టళ్లలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ విద్యకు తగిన బడ్జెట్ కేటాయింపు వంటి అంశాలను ప్రకటించారు. జూలై 10 బంద్‌కు విద్యార్థులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజాసంఘాలు పూర్తి మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. సమావేశంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
