గల్ఫ్ నుంచి వచ్చిన భర్త హత్య – భార్యతో సహా 3 మంది అరెస్ట్ వివాహేతర సంబంధం కారణంగా హత్యకు పథకం.
మోపాల్ ప్రతినిధి చందర్:- న్యాల్కల్ గ్రామంలో గల్ఫ్ నుంచి ఇటీవల తిరిగి వచ్చిన యువకుడు ప్రశాంత్ అలియాస్ బంటి హత్య కేసులో భార్య, ఆమె ప్రియుడుతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. న్యాల్కల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో పనిచేసి ఇటీవల ఇంటికి వచ్చాడు. ప్రశాంత్ భార్య సంధ్య స్థానికంగా నర్సుగా పనిచేస్తోంది.
ఈ క్రమంలో సంధ్యకు అదే గ్రామానికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి ప్రశాంత్ అడ్డంకిగా ఉన్నాడని భావించిన సంధ్య, అనిల్, అతని స్నేహితుడు వెంకట సాయి కలిసి హత్యకు కుట్ర పన్నారు. ప్రశాంత్‌కు అధికంగా మద్యం తాగించి ఇంటి పైకప్పు నుంచి కిందకు తోసేశారు. గాయపడిన ప్రశాంత్‌ను ముందుగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, తదుపరి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ సంధ్య ఆస్పత్రిలోని టాయిలెట్ క్లీనర్ లిక్విడ్‌ను ప్రశాంత్‌కు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినట్లు విచారణలో నిందితుడు వెంకట సాయి అంగీకరించాడు. సంధ్య, అనిల్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు, అందుకే హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కుటుంబ పోషణ కోసం గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చిన ప్రశాంత్ అకాల మృతితో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాదం నెలకొంది. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
