సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: బోధన్ పోలీసుల అవగాహన కార్యక్రమం.
బోధన్ ప్రతినిధి రాహుల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించేందుకు “మన ఊరు – మన భద్రత – మన బాధ్యత” నినాదంతో బోధన్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత బస్టాండ్‌తో పాటు రద్దీ ప్రాంతాల్లో ఎస్‌ఐ హబీబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని ప్రజలకు సూచించారు. అలాగే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా, తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
పట్టణంలో దొంగతనాల నివారణకు ఇళ్లు, వ్యాపార సంస్థలు, విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులు కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థంగా అరికట్టవచ్చని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తమ భద్రతతో పాటు సమాజ భద్రతకు కూడా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

