రుద్రూర్‌లో 5 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్, ప్రధాన సరఫరాదారు పరారీలో.
రుద్రూర్ ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహనాల తనిఖీల్లో 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.50 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
సోమవారం రుద్రూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. జూలై 26న విశ్వసనీయ సమాచారంతో రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబం రోడ్డులో హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రెండు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ఇద్దరిని అనుమానంతో తనిఖీ చేయగా, పెట్రోల్ ట్యాంక్ కవర్ల కింద ప్లాస్టిక్ సంచుల్లో దాచిన గంజాయి లభించింది. ఒకరి వద్ద 3 కిలోలు, మరొకరి వద్ద 2 కిలోలు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు పట్టుబడిన వారిని బీహార్‌కు చెందిన బలవంత్ కుమార్ సింగ్, కోటగిరి మండలానికి చెందిన కరికెల్లి సంజుగా గుర్తించారు. విచారణలో బీహార్‌కు చెందిన రాహుల్ అనే వ్యక్తి నుంచి గంజాయిని తెప్పించి విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరించినట్లు ఏసీపీ తెలిపారు. గంజాయి విక్రయం ద్వారా వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన సరఫరాదారైన రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అలాగే వీరి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏడుగురు వినియోగదారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
కేసును ఛేదించిన సీసీఎస్, చీతా ఫోర్స్, బోధన్ ఏసీపీ, రుద్రూర్ సీఐతో పాటు పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1933కు సమాచారం అందించాలని ఏసీపీ శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై మనోజ్ కుమార్, కోటగిరి ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
