ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

 

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

తెలంగాణ ప్రతినిధి :- తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

 

 

 

ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించబడిందని తెలిపారు. ఇందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కనీస మద్దతు ధర (MSP)పై కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.8,749 కోట్ల చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు.

 

 

 

రాష్ట్రవ్యాప్తంగా 21 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామని, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా మొత్తం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

 

 

 

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, మక్కలు రాష్ట్రంలోకి రాకుండా సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. తరుగూ, తేడాల విషయంలో రైస్ మిల్లర్లు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేసి రైతులకు చెల్లింపులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

 

 

 

తప్పుడు వార్తలపై వెంటనే స్పందించి రైతులకు సరైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. అదే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, హమాలీల సంఖ్యను పెంచాలని సూచించారు. రైతులు ముందుగా నెలల తరబడి చెల్లింపుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడు వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయడం వల్ల కలిగే కాలుష్యంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.

తరువాత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఆధ్వర్యంలో “మహిళా సంక్షేమ వారం” (మే 25–30) నిర్వహణపై సమీక్ష జరిగింది. ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల శంకుస్థాపనలు, మహిళా భద్రత, పోష్ చట్టంపై అవగాహన, సోలార్ పవర్ ప్లాంట్లు, మహిళా మండల సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.