మహిళలను వేధించిన ఐదుగురికి జైలు శిక్ష.. చార్మినార్‌లో SHE టీమ్స్ కఠిన చర్య.

మహిళలను వేధించిన ఐదుగురికి జైలు శిక్ష.. చార్మినార్‌లో SHE టీమ్స్ కఠిన చర్య.

హైదరాబాద్ :-  మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలపై హైదరాబాద్ SHE టీమ్స్ మరోసారి కఠిన వైఖరిని ప్రదర్శించాయి. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మహిళలను వేధించిన ఐదుగురిపై నమోదు చేసిన కేసుల్లో న్యాయస్థానం దోషులుగా తేల్చి శిక్ష విధించింది.

 

 

పోలీసు ఉన్నతాధికారి వి.సి. సజ్జనార్ మార్గదర్శకత్వంలో SHE టీమ్స్ ప్రత్యేక నిఘా నిర్వహించగా, ఐదుగురు వ్యక్తులు మహిళలను అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడినట్లు గుర్తించారు. బాధిత మహిళలకు అసౌకర్యం, మానసిక వేదన కలిగించిన ఈ ఘటనలపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 

 

నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 292తో పాటు సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 70(సి) కింద కేసులు నమోదు చేశారు. వేగవంతమైన దర్యాప్తు అనంతరం వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు విచారణలో నిందితులు దోషులుగా తేలడంతో, ప్రతి ఒక్కరికి మూడు రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది.

 

 

ఈ సందర్భంగా మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్ వంటి ఘటనలను అరికట్టడంలో SHE టీమ్స్ చేపడుతున్న నిఘా, తక్షణ చట్టపరమైన చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని పోలీసులు తెలిపారు. మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే డయల్ 100 లేదా 112కు ఫోన్ చేయాలని, అలాగే SHE టీమ్స్ హెల్ప్‌లైన్, వాట్సాప్ నంబర్ 9490616555 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో జరిగే వేధింపుల ఘటనలను పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.