బోధన్‌లో ఘనంగా ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ వార్డు సభలు.

బోధన్‌లో ఘనంగా ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ వార్డు సభలు.

పట్టణ సుందరీకరణ, ఓటర్ల జాబితా సవరణ, సైబర్ నేరాలపై అవగాహన.

బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో శనివారం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 11వ నుంచి 20వ వార్డుల సంయుక్త వార్డు సభను ఘనంగా నిర్వహించారు.

 

 

 

ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, టౌన్ సీఐ వెంకటనారాయణ, మున్సిపల్ మేనేజర్ రమేష్, బోధన్ ఆర్ఐ నాగేశ్వర్ రావు, మెప్మా పట్టణ సమన్వయకర్త శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ సుందరీకరణ, ఓటర్ల జాబితా సవరణ, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించారు.

పట్టణ సుందరీకరణకు పిలుపు

మెప్మా సమన్వయకర్త శ్రీనివాస్ మాట్లాడుతూ బోధన్‌ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలని, డ్రైనేజీల్లో చెత్త వేయకూడదని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, దోమల నివారణకు మోరీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు.

 

ఓటర్ల జాబితా సవరణపై అవగాహన

ఆర్ఐ నాగేశ్వర్ రావు మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వివరించారు. ప్రతి ఓటరు తమ వివరాలను జాబితాతో సరిపోల్చుకోవాలని, కౌన్సిలర్లు, బీఎల్వోలు సమన్వయంతో 100 శాతం ఖచ్చితత్వానికి కృషి చేయాలని సూచించారు.

 

సైబర్ నేరాలపై అప్రమత్తత

టౌన్ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, OTPలు ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మవద్దని సూచించారు. ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యమే ముఖ్యమని సూచన

వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ మాట్లాడుతూ అధికారులు సూచించిన మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. పిల్లల భవిష్యత్తు కోసం లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. చెత్త నిర్వహణ, సైబర్ భద్రతపై ఇంటింటా అవగాహన కల్పించాలని సూచించారు.

 

 

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, ఆశా వర్కర్లు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.