రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం: గోలి మధుసూదన్ రెడ్డి.

రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం: గోలి మధుసూదన్ రెడ్డి.

ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్‌కు బాట.. వైరాలో రైతు అవగాహన సదస్సు.

 

వైరా ప్రతినిధి ఉపేంద్ర :-  రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కమిటీ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో బుధవారం రైతు అవగాహన సదస్సు నిర్వహించారు.

 

 

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు చిలుకూరి రమేష్ హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారాన్ని పెంపొందించడంతో పాటు రసాయన రహిత ఆహార ఉత్పత్తి సాధ్యమవుతుందని, రైతుల సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.

సదస్సులో కేవీకే శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయం ప్రయోజనాలు, జీవామృతం, ఘన జీవామృతం, పచ్చిరొట్టె ఎరువుల వినియోగం, సేంద్రియ పద్ధతుల ద్వారా నాణ్యమైన పంటల ఉత్పత్తిపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు. భూమి సారం పెంపు, పర్యావరణ పరిరక్షణ, నీటి నాణ్యత మెరుగుదలలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

 

 

 

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, మట్టి ఆరోగ్య కార్డులు, ఎరువుల సబ్సిడీ వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు. భూమి ఆరోగ్యమే రైతు భవిష్యత్తుకు పునాది అని, ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం రైతులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించిన కేవీకే శాస్త్రవేత్తలను కిసాన్ మోర్చా నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, కిసాన్ మోర్చా నాయకులు, రైతు ప్రతినిధులు, కేవీకే శాస్త్రవేత్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.