బిక్నూర్‌లో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమం.. హెల్మెట్ల పంపిణీతో అవగాహన.
బిక్నూర్ ప్రతినిధి :- కామారెడ్డి జిల్లా కలెక్టర్ అషిష్ సంఘ్వాన్ మరియు అదనపు ఎస్పీ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో బిక్నూర్ మండలంలో బుధవారం “అరైవ్-అలైవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు.
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు.

అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. బ్యాంకు అధికారులు లేదా పోలీసు అధికారులు ఎప్పుడూ ఓటీపీలు అడగరని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, వ్యక్తిగత బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని వివరించారు.
పోలీస్ కళాబృందం ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు పాటలు, నాటికల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో బిక్నూర్ సీఐ నరేష్, ఎస్‌ఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది, గ్రామ సర్పంచ్ రేఖ, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
