విద్యార్థుల సంక్షేమంపై టీజీవీపీ ఆందోళన.. అధికారులకు వినతి.

విద్యార్థుల సంక్షేమంపై టీజీవీపీ ఆందోళన.. అధికారులకు వినతి.

బోధన్ ప్రతినిధి రాహుల్‌: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు సకాలంలో అందించాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు గురువారం మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)కు వినతిపత్రం సమర్పించారు.

 

 

బోధన్ డివిజన్ టీజీవీపీ అధ్యక్షుడు మీసాలే నాగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, మరో నాలుగు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయని, మొదటి రోజు నుంచే విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

 

 

పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికే పుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగులు పంపిణీ చేయాలని ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంటే విద్యార్థుల చదువుకు ఆటంకం కలగదని, ఆలస్యమైతే విద్యాభ్యాసంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.