తల్లాడలో విత్తన దుకాణాల తనిఖీ: నకిలీలు అమ్మితే కఠిన చర్యలు.

తల్లాడలో విత్తన దుకాణాల తనిఖీ: నకిలీలు అమ్మితే కఠిన చర్యలు.

లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచన.

తల్లాడ ప్రతినిధి ఉపేంద్ర :-  తల్లాడ మండలంలో వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో పలు విత్తన దుకాణాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తనాల విక్రయంలో నిబంధనల అమలు, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

 

 

 

ఈ సందర్భంగా తల్లాడ సబ్‌ ఇన్‌స్పెక్టర్ వెంకట కృష్ణ మాట్లాడుతూ, డీలర్లు ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి నకిలీ లేదా అనుమతి లేని విత్తనాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని దుకాణదారులకు ఆదేశించారు.

 

 

 

మండల వ్యవసాయ అధికారి ఎండీ. తాజుద్దీన్ మాట్లాడుతూ, రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తన ప్యాకెట్లపై కంపెనీ పేరు, వంగడపు పేరు, లాట్ నంబర్, మొలక శాతం, గడువు తేదీ వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు.

సీల్ తీసిన ప్యాకెట్లు, గ్రామాల్లో అనధికారికంగా విక్రయించే విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల ప్రచారం, సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని హెచ్చరించారు. కొనుగోలు చేసిన బిల్లులను భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవాలని, వీలైతే విత్తనాల మొలక పరీక్ష ముందుగానే నిర్వహించుకోవడం మంచిదని తెలిపారు.

 

 

ప్రభుత్వ అనుమతి లేని హెచ్‌టీ పత్తి విత్తనాలను విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలపై ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని రైతులకు సూచించారు.