బోధన్‌లో ఘనంగా దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి వేడుకలు.
విద్యార్థులకు సైకిళ్లు, స్కూల్ బ్యాగ్స్ పంపిణీ.
బోధన్ ప్రతినిధి రాహుల్:- తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి వేడుకలు బోధన్ పట్టణ కురుమ సంఘం మరియు ఐటీ వింగ్స్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి మాట్లాడుతూ, నైజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో దొడ్డి కొమరయ్య చూపిన ధైర్యం, త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు.

వెట్టిచాకిరి విముక్తి కోసం ఆయన ప్రాణత్యాగం చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కురుమల సంక్షేమం, హక్కుల సాధన కోసం సమిష్టిగా ముందుకు సాగడమే కొమరయ్యకు నిజమైన నివాళి అని తెలిపారు. ఈ సందర్భంగా ఐటీ వింగ్స్ ఆధ్వర్యంలో ఒక పేద విద్యార్థినికి సైకిల్ అందించగా, మరో 40 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, కురుమ సంఘం ప్రతినిధులు, నిర్వాహకులు పెంట శ్రీనివాస్, జె. శ్రీనివాస్, మల్లేష్, పెంట రాజ్ కుమార్, శివకుమార్, శంకర్, సుశాంత్, అనుదీప్, కురుమ సంఘం బోధన్ అధ్యక్షులు వీరయ్య, గంగాధర్, మండల అధ్యక్షులు మేడి రవి, శంకర్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
