విద్యా సంస్థల బంద్‌కు మద్దతుగా పోస్టర్ల ఆవిష్కరణ.

విద్యా సంస్థల బంద్‌కు మద్దతుగా పోస్టర్ల ఆవిష్కరణ.

బోధన్ ప్రతినిధి రాహుల్‌: 

ఈనెల 10న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ బోధన్ పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి అనిల్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి కుషాల్ దేవ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా విద్యా వ్యవస్థ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

 

 

అలాగే ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్లే స్కూల్, ప్రీ-ప్రైమరీ విభాగాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు అందించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 10న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త విద్యా సంస్థల బంద్‌కు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

 

 

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్, ఏఐఎస్‌బీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు విశాల్ దేవ్, ఏఐఎఫ్‌డీఎస్ బోధన్ ఇన్‌చార్జి మోసిన్, నాయకులు వరప్రసాద్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.