“చెరుకు సాగు చేస్తున్నాం.. సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని ఎప్పుడు తెరుస్తారు?” – ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చెరుకు రైతులు.
ఎడపల్లి ప్రతినిధి రాహుల్ : జిల్లాలో మూతపడిన సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఎడపల్లి మండలం దూపల్లి గ్రామంలో రైతు దూపల్లి లక్ష్మారెడ్డి చెరుకు తోటలో నిర్వహించిన చెరుకు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇస్తే రైతులు పెద్ద ఎత్తున చెరుకు సాగుకు సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే రైతులు చెరుకు పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. “మేము చెరుకు పండిస్తున్నాం.. ఇప్పుడు ప్రభుత్వం ఫ్యాక్టరీని ఎప్పుడు తెరుస్తుందో చెప్పాలి” అని ఆయన అన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా లాభాల్లో నడిచిన ఎన్‌సీఎస్‌ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందని ఆరోపించారు. ఈ ఫ్యాక్టరీ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల 110 గ్రామాల రైతులకు చెరుకు సాగులో అనుభవం ఉందని చెప్పారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆరుతడి పంటల్లో చెరుకు కూడా ఒకటేనని, ప్రస్తుతం సుమారు 70 గ్రామాల్లో రైతులు చెరుకు సాగు వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

ఎన్‌ఎల్‌ఓ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రూ.803 కోట్లు కేటాయించినట్లే, సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి రూ.100 కోట్లు కేటాయిస్తే రైతులకు భరోసా కలుగుతుందని ఆకుల పాపయ్య సూచించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ, సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం పునఃప్రారంభించి బెల్లం కేంద్రంగా నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు చెందిన వారే కావడంతో ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బి. లక్ష్మారెడ్డి, వై. సంతోష్, సిర్పూర్ గంగారెడ్డి, కొట్టే గంగాధర్, టెక్మల్ లక్ష్మణ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
