కల్కి చెరువు అలుగు వద్ద బాన్సువాడ మున్సిపల్ అధికారుల బారికేడ్లు ఏర్పాటు.
బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు అలుగు వద్ద మున్సిపల్ అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువు నిండిపోవడంతో అలుగు నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ ఏర్పాట్లు చేపట్టారు.
చెరువును చూసేందుకు వచ్చే ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు అలుగు ప్రాంతానికి వెళ్లకుండా నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. ప్రజలు భద్రతా నియమాలను పాటించాలని, వర్షాకాలం ముగిసే వరకు చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్ మాట్లాడుతూ భారీ వర్షాలతో చెరువులో నీటి మట్టం పెరిగిందని, ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను అలుగు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ సిబ్బంది బారికేడ్ల ఏర్పాటును పరిశీలించి, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు కొనసాగించాలని అధికారులకు సూచించారు.
