చైతన్య ఒకేషనల్ కళాశాలలో అడ్మిషన్లపై ఏఐఎస్‌బీ హెచ్చరిక.
ఫీజుల పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆరోపణలు – తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచన.
బోధన్ ప్రతినిధి రాహుల్ : బోధన్ పట్టణంలోని చైతన్య ఒకేషనల్ కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉందని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ (ఏఐఎస్‌బీ) విద్యార్థి సంఘం హెచ్చరించింది.
స్థానిక ఎస్సీ బాయ్స్ హాస్టల్‌లో సోమవారం ఏఐఎస్‌బీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడారు. చైతన్య ఒకేషనల్ కళాశాలలో చదివిన పలువురు విద్యార్థులు ఫీజుల సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొందరు చదువుకు కూడా దూరమయ్యారని ఆరోపించారు.
అడ్మిషన్ సమయంలో స్కాలర్‌షిప్‌లు, తక్కువ ఫీజుల హామీలతో విద్యార్థులను చేర్చుకుని, రెండు నుంచి మూడు నెలల తర్వాత అదనపు ఫీజులు, పరీక్ష ఫీజులు, టెస్టుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వబోమని, ట్రైనింగ్ అవకాశాలు కల్పించబోమని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కళాశాలలో కనీస మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని, ర్యాగింగ్ ఘటనలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని నాగరాజు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ తీసుకునే ముందు ఫీజులు, ఇతర ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను లిఖితపూర్వక ఒప్పందం రూపంలో తీసుకోవాలని సూచించారు.
లేనిపక్షంలో విద్యార్థులు ఆర్థికంగా, విద్యాపరంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్‌బీ నాయకులు రాజన్న, సురేష్, మోహన్, గంగప్రసాద్, శీను తదితరులు పాల్గొన్నారు.
