గోపాలపేట సమీపంలో 294 కేజీల గంజాయి దహనం.
26 కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల నిర్వీర్యం.
తల్లాడ దేవల్ల ఉపేంద్ర: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామ సమీపంలోని ఏడబ్ల్యూఎం (AWM) కన్సల్టింగ్ లిమిటెడ్ ఆవరణలో ఎక్సైజ్ శాఖ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని దహనం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 26 కేసులకు సంబంధించిన సుమారు 294 కిలోల గంజాయిని శనివారం డ్రగ్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షణలో నిర్వీర్యం చేశారు.
జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పూర్తి చేశారు. గంజాయి దహనం ప్రక్రియను అధికారులు అన్ని నిబంధనలను పాటిస్తూ చేపట్టారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ, సమాజానికి ముప్పుగా మారిన గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు నిరంతర తనిఖీలు, ప్రత్యేక తనిఖీ బృందాలతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, ఎక్సైజ్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
