నాగరాజుపై తప్పుడు కేసులు ఎత్తివేయాలి: విద్యార్థి సంఘాల జేఏసీ.
చైతన్య ఒకేషనల్ కళాశాలపై సమగ్ర విచారణకు డిమాండ్.
బోధన్ ప్రతినిధి రాహుల్: బోధన్ పట్టణానికి చెందిన విద్యార్థి సంఘ నాయకుడు నాగరాజుపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ బోధన్ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో, ఏసీపీలకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు ఎన్. బాల్‌రాజ్ మాట్లాడుతూ, బోధన్‌లోని చైతన్య ఒకేషనల్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపించారు. ల్యాబ్, పరీక్షల ఫీజుల పేరుతో అదనపు భారం మోపడంతో పాటు, కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు టీసీలు, మెమోలు అందజేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
బాధిత విద్యార్థులు తమ సమస్యలను విద్యార్థి సంఘ నాయకుడు నాగరాజు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పలుమార్లు కళాశాల యాజమాన్యంతో చర్చలు జరిపినా స్పందన లభించలేదని తెలిపారు. ఈ క్రమంలో యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరించి నాగరాజుపై తప్పుడు ఆరోపణలు చేసి కేసులు నమోదు చేయించిందని ఆరోపించారు.

అధికారులు చైతన్య ఒకేషనల్ కళాశాలపై సమగ్ర విచారణ జరిపి, విద్యార్థుల ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవాలని, నాగరాజుపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.
విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను ఆలస్యం చేయకుండా అందజేయాలని, లేకపోతే విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఎం.డి. మోషిన్, తల్లారి సంజయ్, ప్రతాప్, రాజన్న, కిరణ్, మోహన్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
