దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి.

దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి.

ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ధర్నా – ఖాజాపూర్, తగ్గేల్లి దళిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్.

బోధన్ ప్రతినిధి రాహుల్ :- సాలూర మండలంలోని ఖాజాపూర్, తగ్గేల్లి గ్రామాలకు చెందిన దళిత రైతులు సాగు చేస్తున్న భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బోధన్‌లోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం (ఆర్డీఓ) ఎదుట సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు.

 

 

 

ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. గంగాధర్, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ, ఖాజాపూర్ గ్రామంలో మూడు దళిత కుటుంబాలు గత 25 సంవత్సరాలుగా సీలింగ్ భూమిని సాగు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. అలాగే తగ్గేల్లి గ్రామానికి చెందిన ఎనిమిది దళిత కుటుంబాలు తొమ్మిదేళ్లుగా సాగు చేస్తున్న భూములకు కూడా పట్టాలు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

పట్టాలు లేకపోవడంతో రైతుబంధు, బ్యాంకు రుణాలు, సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సబ్సిడీలు, పంటల విక్రయం వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దళిత రైతులకు పట్టా పాస్‌బుక్కులు అందజేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి పడాల శంకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జి. దేవయ్య, సీహెచ్. రమేష్, లాలయ్య, గంగారాం, బి. సాయిలు, లక్ష్మణ్, అబ్బయ్య, సీహెచ్. రాములు తదితరులు పాల్గొన్నారు.