తల్లాడలో ఏబీవీపీ విద్యాసంస్థల బంద్ విజయవంతం.
తల్లాడ ప్రతినిధి ఉపేంద్ర: విద్యారంగ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఇచ్చిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ పిలుపు తల్లాడ మండలంలో విజయవంతమైంది. ఈ బంద్కు బీజేపీ నాయకులు మద్దతు ప్రకటించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు చల్లా నాగులు, జిల్లా నాయకులు ఆపతి వెంకట రామారావు, గాదె కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంలో విఫలమైందని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల నియామకాల విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాష్ట్రానికి పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
బంద్ నేపథ్యంలో మండలంలోని బాలభారతి, యూనివర్సల్, డాన్ బాస్కో, లూర్దుమాత, న్యూ జన్ తదితర ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఉద్యమానికి సహకరించిన పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాయల రమేష్, పేరిక కిరణ్, చౌడా నాగేశ్వరరావు, చల్లా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
