ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి: విద్యార్థి సంఘాల జేఏసీ.

ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి: విద్యార్థి సంఘాల జేఏసీ.

బోధన్ ప్రతినిధి రాహుల్: బోధన్‌లోని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంల విక్రయాలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం పీఆర్‌టీయూ భవన్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

 

 

 

ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ, పాఠశాల ప్రాంగణాల్లో పుస్తకాలు, స్టేషనరీ విక్రయించవద్దని విద్యాశాఖ ఆదేశాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వాటిని పట్టించుకోకుండా యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. అలాగే బుక్స్, అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

 

 

బోధన్‌లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేకపోయినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి సహా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ డి. నాగరాజు, నాయకులు ఎన్. బాల్‌రాజ్, మావురం శ్రీకాంత్, ప్రశాంత్, కిరణ్, రాజన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.